NTV Telugu Site icon

Israel-Iran: ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశాలు!.. యుద్ధం జరిగితే ఎవరికి మద్దతివ్వాలనే దానిపై నిర్ణయం

Israel Iran

Israel Iran

Israel-Iran: హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ఇజ్రాయెల్‌కు దెబ్బగా పరిగణించబడుతోంది, ఎందుకంటే ఏప్రిల్‌లో ఇరాన్ దాడి సమయంలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చాయి.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 40 మంది మావోయిస్టుల హతం..

ఇజ్రాయెల్‌పై ఇరాన్ అతిపెద్ద దాడి
ఖతార్ నిర్వహించిన ఆసియా దేశాల సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ అరబ్ దేశాలు, ఇరాన్ మంత్రులు ఉద్రిక్తతను తగ్గించడంపై పరస్పర చర్చలను కేంద్రీకరించినట్లు పలు వర్గాలు తెలిపాయి. ఈ వారం మంగళవారం (అక్టోబర్ 1) ఇరాన్ ఇప్పటివరకు ఇజ్రాయెల్‌పై అతిపెద్ద దాడి చేపట్టింది. గాజా, లెబనాన్‌లలో హమాస్, హిజ్బుల్లా సీనియర్ నాయకులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడిని చేపట్టినట్లు ఇరాన్ అభివర్ణించింది. శుక్రవారం, అక్టోబర్ 4, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన ప్రసంగంలో ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడిని ‘అత్యల్ప శిక్ష’గా అభివర్ణించారు.

ఇజ్రాయెల్ ప్రతీకార బెదిరింపు
అయితే, తమ దాడి ముగిసిందని, అయితే ఇజ్రాయెల్ ఏదైనా రెచ్చగొట్టే చర్య తీసుకుంటే అది మళ్లీ లక్ష్యంగా ఉంటుందని టెహ్రాన్ పేర్కొంది. అదే సమయంలో, ఇరాన్ దాడికి ధీటుగా సమాధానం ఇస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.ప్రతీకారంగా ఇరాన్‌లోని చమురు ఉత్పత్తి కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చని యూఎస్‌ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నింటిలో టెన్షన్‌ని తగ్గించే అంశం అగ్రస్థానంలో ఉందని ఒ రాయిటర్స్ పేర్కొంది. గల్ఫ్ చమురు కేంద్రాలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించనప్పటికీ, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్ష జోక్యం ఉంటే ఈ ప్రాంతంలో దాని ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.