ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ పధకాలను అందించేందుకు గ్రామ, వార్డు వాలంటీర్ అనే సమాంతర వ్యవస్థ ను తీసుకువచ్చింది. గతంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అయినా అందాలంటే గంటల తరబడి క్యూ లో వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ ఒకటికి పది సార్లు తిరిగితే గాని పని జరగని పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం అందించే పథకానికి అర్హులై వున్నా కానీ ఆ పధకం లబ్ది పొందటానికి ఎంతగానో ఎదురు చూడాల్సి వచ్చేది.. కానీ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ప్రజలకు సంక్షేమ పధకాలను అందించే స్వచ్చంద సేవను చేసేందుకు ముందుకు వచ్చిన వారిని వాలంటీర్లుగా నియమించడం జరిగింది.. వారి ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలను చేరువ చేసేలా ప్రణాళికను రూపొందించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సకాలంలో అందుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.స్వచ్ఛంద సేవ చేసే వాలంటీర్ లకు ప్రతీ నెల 5000 రూపాయలను గౌరవ వేతనంగా ప్రకటించారు సీఎం జగన్..
వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గలేదు సీఎం జగన్ ప్రభుత్వం. వారి సేవకు ప్రభుత్వం కేవలం గౌరవ వేతనం మాత్రం అందిస్తోంది. ఇప్పుడు వారి కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం.. వాలంటీర్లకు శుభవార్తను ప్రకటించింది.. వీరి సేవను గుర్తించిన ఏపీ ప్రభుత్వం వీరికి ప్రతీ నెల ఒకటో తేదీనే గౌరవ వేతనం అందించాలని భావిస్తోంది. గౌరవ వేతనం చెల్లింపుల విషయంలో కొన్ని జిల్లాల్లో ఆలస్యం అవుతుందన్న సమాచారంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కంటే ముందుగానే వీరి గౌరవ వేతనం ఫస్ట్ తారీఖునే అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత పోర్టల్ లో మార్పులు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. వాలంటీర్లకు సంబంధించిన బిల్లులు అప్ లోడ్ చేశాకే.. మిగతావి పొందుపర్చేలా పోర్టల్‌లో మార్పులు కూడా జరిగాయి. దీంతో ఇక నుంచి ప్రతీ నెల మొదటి తారీఖునే ప్రతీ వాలంటీర్ కు గౌరవ వేతనం అందుతుంది.