Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు

Cbn

Cbn

Sai Krishna Incident: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాదె సాయికృష్ణను పోలీస్ లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసుపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని సూచించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఘటనతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటనపై చర్చ సందర్భంగా డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపిన విషయాన్ని డీజీపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.

×
×
Ad

అనంతరం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.