Kandi Pappu: మరోసారి బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. దీంతో, తక్కువ ధరకే సామాన్యులకు కందిపప్పు అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. దీనిలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా పలాసలో రెండు ప్రత్యేక కౌంటర్ల ద్వారా కంది పప్పును పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు.. కంది పప్పు ధరలు కొండెక్కిన నేపథ్యంలో ధరల నియంత్రణలో భాగంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ పలాసలో రెండు ప్రత్యేక కందిపప్పు కౌంటర్లను ఏర్పాటు చేయడంతో.. కందిపప్పు కోసం పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు ప్రజలు.
Read Also: Rs 200 and Rs 500 Notes: రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
ఈ ప్రత్యేక కౌంటర్లను పలాస ఆర్డీవో భరత్ నాయక్ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ లో కేజీ కందిపప్పు ధర రూ. 195 నుండి రూ.200 వరకు పలుకుతుండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేజీ రూ. 160లకే అందిస్తుండటంతో పట్టణ ప్రజలు కందిపప్పు కోసం కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఈ ప్రత్యేక కందిపప్పు కౌంటర్లు నేటి నుంచి మూడు రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పలాస సీఎస్‌డీటీ రవికుమార్ తెలిపారు. ఇక, కందుపప్పు ప్రత్యేక కౌంటర్ల ప్రారంభోత్సవంలో తహసీల్దార్ వీఎస్ఎస్ నాయుడు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మరోవైపు.. తక్కువ ధరకే కందిపప్పును అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతున్నారు ప్రజలు.