రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛలోక్తులు విసిరారు. మనం తగ్గాలి కానీ.. బుచ్చయ్య చౌదరి తగ్గరు అని అన్నారు. తనకు ఇష్టమైన నాయకులలో ఒకరు బుచ్చయ్య చౌదరి అని పవన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. బుచ్చయ్య చౌదరిని ప్రశంసించారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని, అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘రాజమండ్రి అనగానే గుర్తుకు వచ్చేది గోదావరి తీరం. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది. ఎందరో మహానుభావులు, కవులు, సాహితీ వేత్తలకు జన్మనిచ్చిన భూమి ఇది. ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం సంతోషం. అఖండ గోదావరి ప్రాజెక్టు కేంద్ర సహాకారం అందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపింది కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగెత్తాడానికి సహకారం అందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నాం’ అని అన్నారు.
Also Read: Pawan Kalyan New Look: డిఫరెంట్ లుక్‌లో డిప్యూటీ సీఎం.. పిక్స్ వైరల్!
‘అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముంది. బైక్‌లో ఇంజన్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంత ఎక్కువ స్పీడ్‌గావెళుతుంది. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలని అన్నాను. కోరుకున్న విధంగానే కూటమి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటోంది. డబుల్ ఇంజన్ సర్కార్‌ను మరింత పరుగెట్టించాలి’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.