సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా జనసేన పార్టీ కోసం పని చేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పేర్కొన్నారు. నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, మంత్రి పదవి విషయం తర్వాత ఆలోచిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కోసం పవన్ సోదరుడు నాగబాబు ఎంతో కష్టపడిన విషయం తెలిసిందే.
మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా చిట్‌చాట్‌లో పాల్గొనగా.. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. ‘ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదు. నాతో కలిసి పని చేసిన వారిని నేను చూసుకోవాలి. నాకోసం, నాతో పని చేసింది వీరే. నాగబాబును రాజ్యసభ సీటు నుంచీ రీకాల్ చేశాను. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం. జనసేన ఇప్పుడే పుడుతున్న పార్టీగా అనుకోవాలి. నాగబాబు విషయంలో అడుగుతారు కానీ.. వైఎస్ జగన్ విషయంలో ఎవరూ అడగరు. వారసత్వ రాజకీయాలు అని అనడం లేదు.నాగబాబును ఎమ్మెల్సీ చేసాక.. మంత్రిని చేసే విషయం ఆలోచిస్తాం. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారు. కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదు. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా’ అని పవన్ చెప్పారు.
‘పార్టీని నేను పట్టించుకునే సమయం దొరకడం లేదు. నేను నా కేడర్ని కలవలేకపోతున్నా. జనవరి 4 నుంచి 14 నాటికి బాగా ప్రిపేర్ అవుతాం. ఇంకా ఏ జిల్లా నుంచి పర్యటన అనేది నిర్ణయించలేదు. సమాన్యుడి సమస్యలు తెలియాలంటే లెఫ్ట్ అనేదే దారి. నాకు గద్దర్ కి మధ్య చాలా అంతరంగిక సంభాషణలుంటాయి. ఖురాన్ ను కళ్ళకద్దుకుని తీసుకుంటాం కానీ భగవద్గీతను అలా తీసుకుంటారని ఆశించలేం. హిందూని మాత్రమే ఖండిస్తారా?, ముస్లింని ఖండించరా? అని నేను లెఫ్ట్ పార్టీలను అడిగాను. రాష్ట్రానికి అభివృద్ధి చాలా అవసరం, మానవ వనరులకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వకుండా తీసుకురాలేం. ప్రజలను స్వయం సమృద్ధిగా తయారు చేయాలి. సంక్షేమం మీద మాత్రమే ప్రజల అభివృద్ధి ఆధారపడదు. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు వంద వరకూ చనిపోయాయి అనే సమాచారం వచ్చింది. కారణం పర్యావరణ కాలుష్యం అని తెలిసింది. మేం పూర్తిస్ధాయిలో తాబేళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.