రేపు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. మరో సభ నిర్వహిస్తోంది. కాగా.. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు.
కాగా… రాప్తాడు సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తైనట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సుమారు 250 ఎకరాల మైదానంలో సిద్ధం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుదని తెలిపారు. అందుకే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని.. సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నామన్నారు. రాప్తాడు సిద్ధం సభతో మూడు సభలు పూర్తవుతాయని.. త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహిస్తామని తెలిపారు.
Y. V. Subba Reddy: విశాఖ నుంచే పరిపాలన.. మరోసారి స్పష్టం
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు జరగబోయే సిద్దం సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా జరగబోతుందని తెలిపారు. నవరత్నాలతో మేనిఫెస్టో తయారు చేసి 98 శాతం ఆ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దని అన్నారు. మరోవైపు.. సీఎం ఏమి చెప్పబోతున్నాడు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉందని పేర్కొన్నారు. భీమిలిలో భయపెట్టాం… దెందులూరులో దడ పుట్టించాం…రాప్తాడులో రఫ్ ఆడిస్తామని తెలిపారు. తెలుగు దేశం పార్టీని లోకేశ్ మడిచి పెట్టేశారు.. రాజ్యసభలో ఖాళీ అయ్యారు… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఖాళీ అవుతారని ఆయన దుయ్యబట్టారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సభ పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. ఇక.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమేనని.. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు.