వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అతిపెద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిలో అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం సంతోషం అని అన్నారు. మరోసారి విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని వైవీ స్పష్టం చేశారు. కోర్టులో చిన్న చిన్న అడ్డంకులు ఉండడం వలన పరిపాలన రాజధానిగా విశాఖ ఆలస్యమైందని తెలిపారు.
Read Also: Kerala: పాఠశాల విద్యార్థుల కోసం కేరళ సర్కార్ కీలక నిర్ణయం
కేసులు వేసి విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. ఇప్పటివరకు వైసీపీ ఏడు జాబితాల అభ్యర్థులను విడుదల చేసింది.. జనసేన, టీడీపీలకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్కొక్క పార్టీతో ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు నమ్మరని సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది. రేపు రాప్తాడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.