Higher Education: ఉన్నత విద్యపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం నిర్వహించారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.. విద్యా రంగంలో కీలక మార్పులపై చర్చించారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలకంగా దృష్టి పెట్టారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్‌మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై సమాలోచనలు చేశారు.. అదే సమయంలో ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై ఫోకస్ చేశారు. మొత్తంగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు సీఎం అడుగులు వేస్తున్నారు.. సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి.. ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావాలని సీఎం జగన్ మిమ్మల్ని ఆదేశించారని తెలిపారు. ఉన్నత విద్య పై ముఖ్యమంత్రికి ఉన్న లోతైన అవగాహన చూసి వీసీలు ఆశ్చర్యపోయారు.. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో పరీక్షా విధానంలోనే చాలా మార్పులు ఉంటాయి.. అంతర్జాతీయ పరీక్షా విధానాన్ని ఇక్కడ అమల్లోకి పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని తెలిపారు. మనం అనుసరించే విధంగా ప్రపంచ పోటీలో మనమే సృష్టికర్తలు కావాలని అన్నారని పేర్కొన్నారు. ఒక్కో వైస్ ఛాన్సలర్‌లతో ప్రత్యేకంగా సీఎం జగన్ వన్ టు వన్ మాట్లాడారు.. విశ్వవిద్యాలయాల అంశం పై ముఖ్యమంత్రి నాలుగు గంటల పాటు చర్చించారు. వైస్ ఛాన్సులర్స్ కేవలం ఒక యూనివర్సిటీకే పరిమితం కాకుండా మిగిలిన యూనివర్సిటీలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారని వెల్లడించారు హేమచంద్రారెడ్డి.
ఇక, సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులు గమనించాలని సీఎం చెప్పారని తెలిపారు హేమచంద్రారెడ్డి.. కొత్త కోర్సులు ఇచ్చే విధంగా.. కోర్సులు లేవని చెప్పకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్చువల్ గా అయినా విద్యను అందించే విధంగా ప్రయత్నం చేయమని సీఎం చెప్పారని.. ఇవాళ మరోసారి వైస్ ఛాన్సులర్ల సమావేశం జరుగుతుంది.. మేం చర్చించిన ఒక నివేదిక తయారు చేసి సీఎం జగన్‌కు అందిస్తాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి.
మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై సీఎం మాకు దిశానిర్దేశం చేశారు.. ఓపెన్ బుక్ విధానంలో పరీక్షా విధానం అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో స్టూడెంట్ కు కావాల్సిన కోర్సులు ,లెర్నింగ్ ఆప్షన్ల పై చర్చించాలి అన్నారు.. గ్లోబల్ గా ఎడ్యుకేషన్ మాప్‌లో ఏపీ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలన్నారు అని పేర్కొన్నారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి.. ఇక, వ్యవసాయరంగంలో అభివృద్ది జరగాలని సీఎం ఆదేశించారు. లోయర్, హయ్యర్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ వినియోగించి మార్పులు తీసుకోవాలని సీఎం తెలిపారన్నారు ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ విష్ణువర్దన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలని సీఎం ఆదేశించారు.. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యావిధానం తీసుకురావాలని సీఎం చెప్పారని పద్మావతి విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్ భారతి వెల్లడించారు. వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి.. పేషంట్లకు అధునాతన పద్దతుల్లో మెరుగైన వైద్యం అందించేలా మెడికల్ స్టూడెంట్స్ కు విద్యా బోధన అందించాలని సీఎం ఆదేశించారు వైఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ బాబ్జి వెల్లడించారు. ఇక, మన విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలి.. కానీ ఫాలోవర్లుగా ఉండ కూడదని సీఎం చెప్పారు.. ఉన్నత విద్యలో నాలెడ్జ్ క్రియేటర్లుగా ఉండాలని సీఎం సూచించారు.. రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉందన్నారు జేఎన్టీయూ వీసీ ప్రసాదరాజు.