CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ (ఇసుక, గనులు, భూ కబ్జాలు) వంటి వాటిపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు సీఎం చంద్రబాబు..
Read Also: CM Revanth Reddy: నేడే లక్ష రుణం మాఫీ.. వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో సీఎం ముఖాముఖి..
గత ప్రభుత్వ హయాంలో.. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరుల పైనా కేసులు నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది.. మరోవైపు.. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వైఎస్ వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తోంది. గడచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేయగా.. శాంతి భద్రతలు ఐదో శ్వేత పత్రం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. ఇవి కాకుండా మరో రెండు శ్వేత పత్రాలు విడుదల చేయాల్సి ఉంది.. వీటిల్లో మద్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వంటి అంశాలున్నాయి. ఈ నెల 20వ తేదీలోగా శ్వేత పత్రాలను పూర్తి చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ శ్వేత పత్రాల అంశాన్ని ప్రస్తావించి.. వాటిపై సభలో చర్చించనుంది ప్రభుత్వం.