మలయాళం సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.. రెండు నెలల్లోనే ఏకంగా మూడు పెద్ద హిట్స్ లభించాయి..అందులో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా సోమవారం (మార్చి 4) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ 11 మంది స్నేహితుల చుట్టూ తిరిగే ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న గుణ గుహల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.కేరళకు చెందిన 11 మంది స్నేహితులు 2006లో తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ కేవ్స్ కు వెళ్లారు. అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ ఓ లోతైన గుహలోకి పడిపోతాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ఏం చేశారన్నదే ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కథ.
అలాంటి కథను కళ్లకు కట్టినట్లు, ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా మూవీ తీయడంతో మలయాళ ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. మలయాళం ఇండస్ట్రీలో రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన నాలుగో సినిమా గా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ నిలిచింది.గతంలో పులిమురుగన్, లూసిఫర్ మరియు 2018 సినిమాలు రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. వీటిలో 2018 మూవీ రూ.177 కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా నిలిచింది.మంజుమ్మెల్ బాయ్స్ కేరళలోనే కాదు తమిళనాడులో అది కూడా సోమవారం (మార్చి 4) రూ.5 కోట్లు వసూలు చేసింది.ఈ సినిమాకు ఏ రేంజ్ లో ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు.ఈ సూపర్ హిట్ మలయాళం మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. 12 రోజుల్లోనే రూ.105 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను చూడాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు