Sandeep Reddy Vanga Says I wants to work with Chiranjeevi: ‘సందీప్ రెడ్డి వంగా’.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. చేసింది మూడు సినిమాలే అయినా.. భారీ క్రేజ్ సంపాదించాడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి.. అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి స్టార్ అయ్యాడు. ఇక ‘యానిమల్’ సినిమాతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి.. ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్‌కు రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో రెండు సినిమాలను ప్లాన్ చేశాడు. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ సినిమా ప్లాన్ చేశాడు. అయితే తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌లతో కలిసి పనిచేయాలనుందని సందీప్ రెడ్డి తన కోరికను వ్యక్తం చేశాడు. చిరంజీవి, షారూఖ్ ఖాన్‌లు తనకు ఆరాధ్యదైవం అని.. వారితో సినిమా చేస్తే ఛాన్స్ ఎప్పుడొస్తుందో తనకు తెలియదన్నాడు. అవకాశం వస్తే ఇద్దరు సూపర్ స్టార్‌లకు అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాస్తానని చెప్పాడు.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ… ‘కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. నెను కథలు సవంతంగా రాస్తా. ఇతరులతో కలిసి పని చేయను. స్క్రిప్ట్ లేదా కథను ఎవరితోనైనా పంచుకోవడం వలన సమయం వృధా అవుతుంది. భవిష్యత్తులో మరింత వేగంగా సినిమాలపై పని చేస్తాను’ అని తెలిపాడు. స్పిరిట్ ప్రీ-ప్రొడక్షన్ కోసం సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 2025లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆపై ‘యానిమల్’కి సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ను, అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నాడు.