Anil Kumar Yadav: నారా లోకేష్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. యువ గళం పాదయాత్రలో నాపై ఎన్నో వ్యాఖ్యలు చేశారు.. మా తాత, మా నాన్న ముఖ్యమంత్రి కాదు.. కానీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో మంత్రి అయ్యాను.. కానీ, నువ్వు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయావు.. మీ తాత.. మీ నాన్న ముఖ్యమంత్రి కాకపోతే వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేవు అంటూ సెటైర్లు వేశారు.. నన్ను సిల్లీ బచ్చా అన్నావ్.. గత ఎన్నికల్లో నాపై పోటీ చేసిన వ్యక్తి వంద కోట్లు ఖర్చు పెట్టారు.. 2024లో కూడా 200 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.. పిల్ల బచ్చాన్ని చూసి ఎందుకు అంత వణికిపోతున్నారు? అని ప్రశ్నించారు.
నాకు టికెట్ రాదని అంటారా..? రాష్ట్ర ప్రజలందరూ పులకేసి అనుకుంటున్నారు.. పిల్ల బచ్చానే దమ్ముంటే నాపై పోటీచేయి అంటూ నారా లోకేష్‌కి సవాల్ చేశారు అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు సిటీ నుంచి నా మీద పోటీ చేసి గెలిచినా.. లేదా 2024లో నా గెలుపును ఆపినా.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటాను.. గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అంటూ సవాల్ విసిరారు.. నా సవాల్ స్వీకరించాలి.. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. నేను నాయుడుపేటలో వంద కోట్ల రూపాయల విలువైన లేఔట్ వేశానని చెప్పావు.. ఒక శాతం భాగం కూడా నాకు లేదన్నారు.
టీడీపీ నాయకులు ఏమేమి చేస్తున్నారనే విషయాన్ని కూడా మాట్లాడుకుందాం అన్నారు అనిల్ కుమార్.. ఇంకా సమయం ఉంది. లోకేష్ తెలుగులో మాట్లాడినా అనువాదకులను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.. ఆయన ఏం మాట్లాడుతాడో ప్రజలకు అర్థం కాదని దుయ్యబట్టారు.. ఇక, ఎంతో చరిత్ర ఉందని చెప్పుకునే ఆనం రామనారాయణరెడ్డి పరువును.. లోకేష్ కాళ్ల ముందు పెట్టాడని విమర్శించారు. ఆయన చుట్టూ తిరగడాన్ని చూస్తే ఆనం పరిస్థితి అర్థమవుతుంది అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్.
కాగా, నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేశారని, ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని నారా లోకేష్ విమర్శించిన విషయం విదితమే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించిన లోకేష్.. గత ఎన్నికల తర్వాత మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి వచ్చాయని, సగం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యాడని విమర్శించారు. ఆయనకు పని తక్కువ, డైలాగులు ఎక్కువని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా? ఈ సిల్లీ బచ్చా నాకు చాలెంజ్ విసురుతున్నాడు. చర్చ అంటూ సరదా పడుతున్నాడంట.. వచ్చేయ్ అంటూ సవాల్ చేశారు.. నీ సీటు జగన్ ఆల్రెడీ చింపేశాడు బ్రదర్. నేను ఇప్పుడు నాయుడుపేటలోనే తిరుగుతున్నా. దోపిడీ సొమ్ము, బినామీల పేరుతో నువ్వు వేసిన రూ.100 కోట్ల అక్రమ లే అవుట్ ఉంది కదా. షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న నీ వంద కోట్ల లే అవుట్ లో చర్చించుకుందాం రా అంటూ చాలెంజ్ చేసిన విషయం విదితమే.