Anil Ambani in Trouble: భారతదేశ కుబేరుడిగా వెలుగొందిన రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా అనిల్ అంబానీతో సంబంధం ఉన్న పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలను కోరింది. ఈ బ్యాంకుల జాబితాలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఆంగ్లపత్రిక ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యూకో బ్యాంక్, సింద్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నట్లు పేర్కొంది. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చాయి. ఈ సంస్థలకు ఇచ్చిన అప్పుల్లో ఎంతకు తిరిగి చెల్లించని కేసుల్లో భాగంగా కొందరు అధికారులకు ఈడీ నోటీసులు జారి చేసింది. ఈడీ ఆయా అధికారులను లోన్ క్లియరెన్స్‌కు సంబంధించి అనుసరించిన విధివిధాలను అడిగినట్లు సమాచారం.
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 5న అనిల్ అంబానీ విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్‌ను కూడా ఇచ్చింది. ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేయనుంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు కూడా రాబోయే రోజుల్లో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది.
Also Read: Revanth Reddy-Komatireddy: మళ్లీ సీఎం కావాలని పూజలు చేశా.. సీఎం, మంత్రి ఫోన్ కాల్ వైరల్!
యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు లభించిన రూ.3,000 కోట్ల రుణంపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. బిస్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పార్థసారధి బిస్వాల్‌ను గత వారం రూ.3,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న కారణంగా అరెస్టు చేశారు. ఈక్రమంలో ఆయనపై పీఎంఎల్ఎ చట్టాన్ని ప్రయోగించారు. రిలయన్స్ పవర్ కోసం దాదాపు రూ.68.2 కోట్లకు తప్పుడు హామీ పత్రాలను సమర్పించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.