Andhrapradesh: ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీల టెర్మినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 20 శాతం మంది అంగన్వాడీలు విధుల్లో చేరినట్లు సమాచారం. మొత్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తవారిని చేర్చుకునేందుకు 26వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన అంగన్వాడీల టెర్మినేషనుకు సంబంధించిన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 25వ తేదీన కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిసింది.
Read Also: CS Review on Elections: ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష.
అంగన్వాడీల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఓ వైపు సుదీర్ఘంగా సమ్మె చేయడంతో పాటు.. ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వారిపై చర్యలకు సిద్ధం అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆర్డర్స్‌ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు. అందులో భాగంగా విశాఖ జిల్లాలోని అంగన్వాడీలకు షాక్ ఇచ్చారు కలెక్టర్.. ఎస్మా ఉల్లంఘనకు పాల్పడ్డ సిబ్బంది తొలగింపుకు చర్యలు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇళ్లకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.