Deputy CM Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా చేనేత మగ్గానికి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందజేయనున్నామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం వివరించారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా చిన్న చేనేత కుటుంబాలకు ఉత్పత్తి వ్యయం తగ్గి కొంత మేర ఉపశమనం లభించనుందని పేర్కొన్నారు.
READ ALSO: YS Jagan : 1100 కోట్లు గంగలో పోసినట్టేనా..? అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ సంచలన లెక్కలు..!
2017లో నేతన్నలు తనను కలసి వారి కష్టాలు చెప్పుకొన్నప్పుడు తన మనసు చలించిందని గుర్తు చేసుకున్నారు. వారికి తన వంతు అండగా నిలిచేందుకు తనకు తానుగా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకు వచ్చానని అన్నారు. వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని తానిచ్చిన పిలుపు యువతలో చైతన్యం నింపిందన్నారు. నివార్ తుపాను కారణంగా వెంకటగిరి చేనేత మగ్గాలకు నష్టం జరిగినప్పుడు స్వయంగా వెళ్లి వారి కష్టాలు చూసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చానన్నారు. ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న వేళ కూటమి భాగస్వామ్యపక్షంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. గడచిన 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ… అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రయోజనం పొందబోతున్న ప్రతి చేనేత కుటుంబానికి డిప్యూటీ సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
READ ALSO: YS Jagan: రాజధాని విషయంలో ‘ప్లాన్-బి’ని చంద్రబాబు ఎందుకు తొక్కేస్తున్నారు? జగన్ సంచలన వ్యాఖ్యలు!
