Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్టర్స్ సమ్మిట్) పై క్యాబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు రూ. లక్ష కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. దాని వల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు సీఆర్డీఏ (CRDA) పనులు కోసం NaBFID నుంచి రూ. 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతిని కూడా క్యాబినెట్ ఇవ్వనుంది. ఈ క్యాబినెట్ భేటీలో అత్యంత కీలకంగా పరిగణించదగిన అంశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం ఒకటి. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల మేరకు జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.