Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ రోజు సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలుత 14న మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని భావించినా కొన్ని కారణాలతో ఇవాళ్టికి మార్చారు. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో మంత్రివర్గం సమావేశమవుతోంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై చర్చిస్తారు. జనవరి 1 నుంచి 3 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాల పై చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Also: IND vs SA: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం! సిరీస్ సమం
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల నుంచి కేబినెట్ లో ఉంచాల్సిన ప్రతిపాదనలను సీఎస్ తెప్పించారు. ఈ కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది.. భారీ ఎత్తున పంట నష్టం జరిగింది.. ఈ సమయంలో.. ముందస్తుగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంది.. ఈ నేపథ్యంలో తుఫాన్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.. కాగా, ఇప్పటికే రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసింది.