కాలం ఎంత ముందుకు వెళ్లినా.. వంట గదిలో నుంచి అంతరిక్షంలోకి అడుగు పెట్టినా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఎక్కడోఒకచోట జరుగుతూనే ఉన్నాయి. దీనికి మరో ఉదాహరణ జార్ఖండ్‌లో జరిగిన అమానవీయ ఘటన. పెళ్లికి ఓ యువతి అంగీకరించకపోవడంతో గ్రామ పెద్దలు ఆమెకు గుండు గీయించి చెప్పుల దండలు వేసి ఊరేగించి అవమానించారు. జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో జరిగిన ఈ ఘటన పౌర సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
Also Read : Kodanda Reddy : రాష్ట్రంలో వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
ఆడపిల్ల చదువుకున్నా, చదువుకోకపోయినా.. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఆమె హక్కు. ఎందుకంటే ఆమె భవిష్యత్తు పెళ్లిచేసుకునేవాడితోనే జీవించాలి. అయితే ఈ అమ్మాయి కుటుంబీకులు చూసిన అబ్బాయితో పెళ్లికి అంగీకరించకపోవడంతో కుటుంబసభ్యులు పంచాయితీ పెట్టి ఆమెకు గుండు కొట్టించాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీకి 185 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, ముగ్గురు పంచాయితీ సభ్యులతో సహా మొత్తం నలుగురిని విచారణ నిమిత్తం అరెస్టు చేసినట్లు పటాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గుల్సన్ గౌరవ్ తెలిపారు.
ఇలా బంధువుల అవమానాలకు గురైన యువతి మానసికంగా కుంగిపోయి మేడినగర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. యువతి వివాహం ఏప్రిల్ 20న జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు వరుడు గ్రామానికి చేరుకోగా, అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. దీని తరువాత, సదరు యువతి 20 రోజులు కనిపించకుండా పోయింది. అయితే.. ఇటీవల యువతి గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి గ్రామానికి చేరుకుందన్న వార్త తెలియగానే ప్రజలు గుమిగూడి పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారిలో.. ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు.. నీకు ఏమైంది అని కూడా ఆ అమ్మాయిని అడిగారు.. అయితే తమ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో.. ఆగ్రహించిన కుటుంబీకులు ఆమెపై దాడి చేయడమే కాకుండా గుండు కొట్టించి, చెప్పులతో దండలు వేసి ఊరంతా తిప్పారని పోలీసు అధికారి గుల్షన్ గౌరవ్ తెలిపారు.