ఓ షాప్ యజమాని రూ. 300 విలువైన నకిలీ ఆభరణాలను రూ. 6 కోట్లకు విక్రయించాడు. అది కూడా ఓ అమెరికన్ మహిళకు అమ్మెశాడు. విషయం తెలుసుకున్న మహిళ యజమానిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం యజమాని పరారీలో ఉన్నాడు. అమెరికా పౌరురాలైన చెరిష్.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లో ఒక దుకాణంలో బంగారు పాలిష్‌తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఈ ఆభరణాలను ప్రదర్శించగా.. అవి నకిలీ నగలని తేలింది. నగలతో జైపుర్‌కు చేరుకున్న చెరిష్ దుకాణ యజమాని రాజేంద్ర సోని, అతడి కుమారుడు గౌరవ్‌లను నిలదీశారు. ఆమె మాటలు నిజం కాదని రాజేంద్ర బుకాయించడంతో మే 18న మనక్ చౌక్ పోలీస్‌స్టేషనులో చెరిష్ ఫిర్యాదు చేశారు.
నిందితుడైన రాజేంద్ర సోని తిరిగి బాధితురాలిపై తప్పుడు కేసు పెట్టాడు. ఈ విషయాన్ని ఆమె అమెరికన్ రాయబార కార్యాలయం దృష్టికి చెరిష్ తీసుకువెళ్లారు. ఎంబసీ జోక్యంతో జైపుర్ పోలీసులు విచారణను వేగవంతం చేసి రాజేంద్ర అమ్మిన నగలు నకిలీయే అని తేల్చారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పరారీలో ఉన్నారని, ఆ నగలకు ధ్రువపత్రం జారీచేసిన నందకిశోర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్ర జైపుర్‌లో ఇటీవలే రూ.3 కోట్ల ఫ్లాటు కొన్నట్లు తెలిసిందన్నారు. నిందితులు వెండి నగలకు బంగారుపూత పూసి అమెరికన్ మహిళను మోసం చేశారని, వారి కోసం గాలింపునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు అదనపు డీసీపీ బజరంగ్ సింగ్ షెకావత్ వెల్లడించారు.