మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజద్ భాష పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అంత అలుసా? అని ప్రశ్నించారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం అని చెప్పారు. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా? అని అంజద్ భాష ఫైర్ అయ్యారు. కడపలో అయన ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు.
‘మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రిమ్స్ నిర్మించారు. తర్వాత వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో ఒక్కో మెడికల్ కళాశాలలను నిర్మించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో కేటాయించిన 50 సీట్లను కూడా వెనక్కి ఇచ్చింది. పేద ప్రజలంటే చంద్రబాబుకు అలుసా?. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం. పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ ద్వారా నాణ్యమైన చికిత్సలను ఉచితంగా అందించాం. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా?’ అని అంజద్ భాష మండిపడ్డారు.
Also Read: Botsa Satyanarayana: ఎలాంటి వారికి గవర్నర్ పదవి.. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై బొత్స సీరియస్!
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ప్రాంతాలలో 2023-24 నుంచే కళాశాలలు ప్రారంభమయ్యాయి. దాంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2360 నుంచి 4910కి పెరిగింది. ఈ కాలేజీలలో సగం సీట్లను ఉచితంగా, మిగిలిన సీట్లను ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే తక్కువ ఫీజుతో అందించాలని అప్పటి సీఎం నిర్ణయించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని భావించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. 17 కళాశాలలలో పదింటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం లభించింది.