Ambati Rambabu: పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు. వైఎస్ భారతిపై అనుచిత కామెంట్స్ చేస్తున్నారని.. వీటిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
స్పీకర్‌గా ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా ప్రయోజనం లేదన్నారు. ఈ దేశంలో నేరం జరిగిందని ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయడం లేదని అన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 173 ప్రకారం ఫిర్యాదు వచ్చిన సమాచారం తెలిసినా 14 రోజుల లోపు కేసు నమోదు చేయాలన్నారు. కానీ గత నెల 17న తాను వెళ్లి ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవన్నారు. ఆర్జీవీ, పోసానిలపై ఎవరో ఫిర్యాదు చేశారని వెంటనే కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. టీడీపీలో చోటా నాయకులు ఫిర్యాదులు చేసినా వెంటనే చర్యలు తీసుకున్నారని… మా ఫిర్యాదులు మాత్రం చెత్త బుట్టలో పడేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Home Minister Anitha: కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయి.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
. శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. ఎస్పీ కార్యాలయంలేదా డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామన్నారు. నిరసన చేసే తేదీ తాను చెప్పనని.. ఎందుకంటే హౌస్ అరెస్ట్‌లు చేస్తారని మాజీ మంత్రి పేర్కొన్నారు. నేరుగా వెళ్లి నిరసన తెలపాలని అనుకుంటున్నామని.. నా నిరసన నా ఆవేదన అంటూ ఆయన చెపుకొచ్చారు. పోలీసుల వద్ద టీడీపీకి ఓ చట్టం, వైసీపీకి ఓ చట్టం ఉందా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. మేము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామన్నారు. తనపై కొందరు ట్రోలింగ్స్ చేస్తున్నారని.. తాను ట్రోలింగ్స్‌కు భయపడే వ్యక్తిని కాదన్నారు. ప్రతి ట్రోలింగ్‌పై చట్ట ప్రకారం వెళతామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని.. మేము పెట్టిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలన్నారు. గన్ మెన్లు ఉన్నా లేకున్నా భయపడే వ్యక్తిని కాదన్నారు. ఒకప్పుడు నాకు పది మంది గన్ మెన్లు ఉన్నారు.. ఇప్పుడు ఒక్క గన్ మెన్ కూడా లేరు.. అయినా భయపడనన్నారు.