Home Minister Anitha: విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాదాలలో బాధితులకు ఈ కేంద్రం సహకారం అందించనుందని వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితుల సహాయం కోసం 7995095793 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. కొన్ని ఇన్స్యూరెన్స్ పాలసీలలో మార్పు రావాలని.. అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నామన్నారు. ఆటోల వల్ల కొంత సమస్య ఉందని.. ఆటోలకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.
Read Also: Pushpa -2 : హిందీ మూడు రోజుల కలెక్షన్స్.. ఊచకోత.!
ఈ మధ్య కాలంలో ట్వీట్స్ పెరిగాయని.. వైసీపీ పాపాలు బయట పడుతుంటే ట్వీట్ చాటున బయటకొస్తున్నారని హోంమంత్రి విమర్శించారు. కనీస విలువలు పాటించని శకుని లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అని.. సీఎం స్థాయి పెద్ద వాళ్లపై విజయసాయి మాటలు బాధాకరమన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణా మీద సీబీ సీఐడీతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ చక్కగా పని చేస్తోందన్నారు. అందుకు మౌనంగా ఉన్న వైసీపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారన్నారన్నారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా, అందులో వైసీపీ నేతల పాత్ర ఉందన్నారు. విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటకొచ్చాయన్నారు.
గడిచిన ఐదేళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్వహణ చెయ్యలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకా దృష్టి పెట్టామన్నారు. నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని.. సర్వేలైన్స్ పెంచామన్నారు. బాడీ కెమెరాలు, నూతన ఫేస్ డిటెక్టివ్ సిస్టమ్స్ కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో గంజాయి పై ఉక్కుపాదం మోపామన్నారు. డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నామని.. ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలు పెట్టిందని హోంమంత్రి స్పష్టం చేశారు.