PM Modi: ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. 25 ఏళ్ల నుంచి ఎన్డీయే దేశ సేవలో ఉందని.. ఎన్డీయే అంటే “న్యూ ఇండియా డెవలప్‌మెంట్ ఆస్పిరేషన్”గా ప్రధాని అభివర్ణించారు. ఒకరికి వ్యతిరేకంగా తాము తయారవ్వలేదని.. ఒకరి నుంచి అధికారాన్ని లాక్కోవడానికి ఎన్డీయే ఏర్పడలేదని మోడీ స్పష్టం చేశారు. బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై ఎన్డీయేను ఎదుర్కోవడానికి I.N.D.I.A(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అనే పేరుతో కొత్త కూటమిని ప్రకటించిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఉద్దేశంతో కూటమి ఏర్పడినప్పుడు, కులతత్వాన్ని, ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు, బంధుప్రీతి విధానంలో పొత్తు పెట్టుకున్నప్పుడు అలాంటి కూటములు దేశానికి హానికరమని ప్రధాని మోదీ ఆరోపించారు. 2014కి ముందు సంకీర్ణ ప్రభుత్వం విధాన పక్షవాతంతో ఇరుక్కుపోయిందని విమర్శించారు.
Also Read: Delhi Floods: తాజ్ మహల్ దగ్గరకు వరద నీరు..! 1978 తర్వాత అలాంటి దృశ్యం
మన దేశంలో రాజకీయ సంకీర్ణాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. కానీ ప్రతికూలతపై నిర్మించబడిన ఏ సంకీర్ణం ఎప్పుడూ విజయవంతం కాలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణాలను ఉపయోగించుకుంటోందని మోడీ ఆరోపించారు. 90వ దశకంలో దేశంలో అస్థిరతను తీసుకురావడానికి కాంగ్రెస్ కుట్రలను ఉపయోగించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని వాటిని పడగొట్టిందని తెలిపారు. బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని.. కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు రోజూ తిట్టుకుంటాయని మోడీ దుయ్యబట్టారు. వీళ్లంతా ఒక్క దగ్గరకు చేరుతారేమో గానీ, ముందుకు చేరలేరని ప్రధాని జోస్యం చెప్పారు. తనను తిట్టేందుకు కేటాయించే సమయాన్ని దేశ ప్రజల కోసం కేటాయిస్తే బాగుండేదన్నారు. గత ఎన్నికలలో మాకు 45 శాతం ఓట్లు వచ్చాయని.. 250 చోట్ల మాకు 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ప్రధాని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే ఓట్ల శాతం 50 శాతానికి పైనే ఉంటుందని మోడీ తెలిపారు. 2024లో ఎన్డీయే ఓట్ల శాతం 50 శాతానికి పైగా ఉంటుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో అన్ని పార్టీలు ఓట్లు అడగాలని అన్నారు. భారతదేశం ఎన్డీయే మూడవ పదవీకాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Anurag Thakur: భారతీయ సంస్కృతి, సమాజాన్ని కించపరిచే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను అనుమతించబోం
భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని.. దేశంలో ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మేకిన్ ఇండియాను అమలు చేస్తూనే, పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. అవినీతిని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని.. గత 9 ఏళ్లలో అవినీతికి అవకాశం వున్న అన్ని మార్గాలను తగ్గిస్తూ వచ్చామని మోడీ తెలిపారు. జీవితాంతం కాంగ్రెస్‌లో వున్న ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చి గౌరవించామని, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, తరుణ్ గొగోయ్ వంటి నేతలకు పద్మ అవార్డులు ఇచ్చామని ప్రధాని గుర్తుచేశారు. అంతే తప్పించి తాము రాజకీయాలు చేయదలచుకోలేదన్నారు. 1998లో ఎన్డీయే ఏర్పడిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఒకరిని అధికారం నుంచి తరిమికొట్టేందుకు కాకుండా దేశంలో సుస్థిరత తీసుకురావడానికి ఎన్డీయే ఏర్పడిందని అన్నారు. దేశ ప్రజల పురోగతికి ఎన్డీయే కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశం యొక్క పురోగతి, భద్రత, ప్రజల సాధికారత తమ సిద్ధాంతమని.. అదే తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజల సాధికారత కోసం తాము ఏ ఒక్క అవకాశాన్ని వదలిపెట్టలేదని అన్నారు.
కొవిడ్ మహమ్మారి విజృంభించిన తరుణంలో పార్టీలకు అతీతంగా అందరికీ సాయం అందించామని నరేంద్ర మోడీ అన్నారు. భాష ప్రజల మధ్య విభేదాలకు ఆయుధంగా మారిందని.. కానీ తాముమాతృభాషకు ప్రాధాన్యమిచ్చామని ఆయన వెల్లడించారు. సామాన్యులను విపక్ష పార్టీలు తక్కువగా అంచనా వేస్తున్నాయని.. విపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని మోడీ దుయ్యబట్టారు. చిన్న చిన్న స్వార్ధాలతో సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.