Kerala Black Magic Case: కేరళలోని పథనంతిట్ట జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ముగ్గురు వ్యక్తులు కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా చంపిన కేసులో పోలీసులు నిందితులను విచారించారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాల సేకరణ కోసం పోలీసులు నిందితులైన భగవల్ సింగ్, లైలాను తిరువళ్లలోని వారి ఇంటికి తీసుకెళ్లారు. మాంత్రికుడు రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సాయంతో ఈ నేరం చేసినట్లు ఆ దంపతులు పోలీసులకు వివరించారు. రషీద్ సూచనల మేరకు మృతుల శరీర భాగాలను వండుకుని తిన్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మృతుల శరీర భాగాలను వండుకుని నిందితులు తిని ఉండొచ్చని, ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని కొచ్చి సీపీ నాగరాజు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు మహిళల శరీర భాగాలన్నింటిని రికవర్ చేశామన్నారు.
డబ్బుకు ఆశపడిన ఓ దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా ఇద్దరు యువతులను దారుణంగా నరబలి ఇచ్చారు. కేరళలోని పథనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిని నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు. ముగ్గురు కలిసి ఇద్దరు యువతులను నరబలి ఇచ్చారు. 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలను వీరు టార్గెట్ చేశారు. వీరిద్దరు కేరళలోని కడవంతర, కాలడి నివాసితులు. వీరిలో ఒకరు ఈ ఏడాది జూన్ లో కనిపించకుండాపోగా.. మరో మహిళ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయింది. వీరిద్దరిని గొంతు కోసి, శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు భగవల్ సింగ్, లైలా తిరువల్ల నివాసితులు కాగా.. షఫీ పెరుంబవూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు భగవల్ సింగ్ దంపతుల ఇంటికి హత్యగావించబడ్డ యువతులను షఫీనే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మరింత మందిని నరబలి ఇవ్వాలని నిందితులు భావించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.”ప్రధాన నిందితుడు షఫీ.. ఆర్థికంగా సమస్యల్లో ఉన్న వారిని ఫేస్‌బుక్ ద్వారా గుర్తించేవాడు. అలానే భగవల్ సింగ్, లైలా గురించి తెలుసుకున్నాడు. నరబలి ఇచ్చేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు కనుగొన్నాడు. ఇదంతా చేసేందుకు షఫీ తన భార్య సెల్‌ఫోన్ ఉపయోగించాడు. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు.షఫీ ఎవరినైనా లైంగికంగా వేధించాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని కొచ్చి డీసీపీ ఎస్.శశిధరన్ వెల్లడించారు. ఈ నరబలి కాకుండా వేర్వేరు నేరాలకు సంబంధించి షఫీపై 8 కేసులు నమోదయ్యాయన్నారు. తిరువళ్లకు చెందిన ఓ మహిళను ఇందుకోసం షఫీ తీసుకొచ్చాడు. అయితే.. ఆమె తాను ఎక్కడుందన్న వివరాల్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఆమెను చంపితే దొరికిపోవడం ఖాయమని భయపడిన నిందితులు.. నరబలి ఆలోచనను విరమించుకున్నారు. అలానే ఓ చిన్నారితో కూడిన కుటుంబాన్ని కూడా షఫీ నరబలి కోసం భగవల్-లైలా ఇంటికి తీసుకొచ్చాడు. అయితే.. వారు ఎవరు, ఏమయ్యారనే విషయంపై స్పష్టత లేదు. పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.
Wife and Husband: క్షణికావేశంలో భర్తలపై భార్యల దాడులు
ఈ కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులు భగవల్ సింగ్, లైలా, రషీద్ అలియాస్ మహ్మద్ షఫీని పోలీసులు ఎర్నాకుళం జిల్లా సెషన్స్ కోర్టులో ప్రవేశ పెట్టారు. న్యాయస్థానం వారికి 14 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అసలు ఈ మిస్టరీ ఎలా వీడిందంటే.. హత్యకు గురైన ఇద్దరు మహిళల్లో ఒకరు జూన్‌లో, మరొకరు సెప్టెంబర్‌లో కనిపించకుండా పోయారు. వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ కాల్ డేటా, టవర్ లొకేషన్ల ఆధారంగో దర్యాప్తు చేపట్టగా.. ఈ నరబలి వ్యవహారం బయటపడింది. ఈ కేసులో షఫీ కుట్రదారుడని, అతడు ఓ కామాంధుడని సీపీ నాగరాజు వెల్లడించారు.