Akash Ambani : భారతదేశ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా బుధవారం ఓ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మినిచ్చారు. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆకాశ్, శ్లోకాలకు 2019లో వివాహం జరిగింది. వారికి 2020లో మొదటి సంతానంగా బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి ఆకాశ్ దంపతులకు పాప జన్మించింది.
అకాశ్ దంపతులకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ పరిమల్ నథ్వానీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆకాశ్, శ్లోకా అంబానీల లిటిల్ ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ అమూల్యమైన క్షణాలు మీ జీవితాలకు అపారమైన ఆనందాన్ని ప్రేమను తెస్తుందని పేర్కొంటూ ఎంపీ ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లో ముంబయిలోని ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో శ్లోకా కనిపించారు. ఆ సమయంలో ఆమె రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్టు ప్రకటించారు. వారం కిందట కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు.
Read Also: Viral news : రైల్వే ట్రాక్ పై డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్..
ప్రస్తుతం ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంబానీ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న పాఠశాలలో చదువుకున్న ఆకాశ్, శ్లోకాలు ఒకరినొకరు ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అనంతరం వారి పెళ్లి జరిగింది. శ్లోకా తండ్రి ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్ మెహతా. ముకేష్ అంబానీ కుమార్తె ఈషా గతేడాది కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రసవం అమెరికాలో జరిగింది. అక్కడ నుంచి భారత్‌కు తన కవలలతో వచ్చిన కుమార్తెకు అంబానీ కుటుంబం ఘనస్వాగతం పలికిన విషయం తెలిసిందే.