ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిందని, అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్మికులను రాయితీలతో ప్రలోభాలకు గురి చేశారన్నారు ఏఐటీయూసీ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదన్నారు. మణుగూరు లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంతో రెండు ఓట్ల వ్యత్యాసంతో ఓటమిపాలయం. రీకౌంటింగ్ కి అపిల్ కి పోతమన్నారు. ఆఫీసులో అడ్రస్సులు బ్యానర్లు లేకుండా రాత్రికి రాత్రికి మంత్రి రాకతో ప్రలోబాలకు గురిచేసి ఓట్లు గుంజుకున్నారని ఆయన మండిపడ్డారు. కార్మిక సమస్యలపై గుర్తింపు సంఘంగా చట్టసభల్లో మాట్లాడి కార్మికులకు లబ్ధి చేకూరుస్తామన్నారు రంగయ్య.
ఇదిలా ఉంటే.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీపై వామపక్ష అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘం దాదాపు 1999 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలలో 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.