ఈ రోజుల్లో అందరినీ మెప్పించాలనే ఆరాటంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. ముఖ్యంగా మహిళలు ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ ఎదుటివారి కోసం తమ ఇష్టాలను చంపుకోవడం తరచుగా చూస్తుంటాం. అయితే, మహిళలకు ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం వారి ‘గొంతుక’ అని ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గుర్తు చేశారు. ఏదైనా నచ్చనప్పుడు నిర్మొహమాటంగా ‘కాదు’ (No) అని చెప్పగలగడమే ఒక మహిళకు ఉండే అసలైన శక్తి అని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ మాటలు నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. కేవలం విజయాలు సాధించడమే కాదు, మన విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని తిరస్కరించడం కూడా గొప్ప విషయమేనని ఆమె నొక్కి చెప్పారు.
Also Read : Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!
సమాజం మనపై రుద్దే అంచనాలను చూసి భయపడకుండా, వాటిని ఒక సవాల్‌లా తీసుకోవాలని ఐశ్వర్య పిలుపునిచ్చారు. ఏదైనా నచ్చకపోయినా లేదా మనవల్ల కాకపోయినా ‘లేదు’ అని చెప్పడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అది మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుందని ఆమె వివరించారు. ఇదే విషయాన్ని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు. ప్రతిదానికీ ‘అవును’ అంటూ తలలూపడం వల్ల పని ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. మనకంటూ కొన్ని హద్దులు (Boundaries) గీసుకున్నప్పుడే ఎదుటివారి నుంచి మనకు గౌరవం దక్కుతుంది. అందుకే, మీకు ఏదైనా నచ్చనప్పుడు మొహమాట పడకుండా ఆత్మవిశ్వాసంతో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ ఎదుగుదలకు అదే మొదటి మెట్టు!