Airtel 5G: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పుర్, వారణాసి నగరాల్లోని వినియోగదారులు 5జీ+ సేవలను ఆనందించొచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను శనివారం ప్రారంభించారు. అయితే, ఈ సేవలు తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5జీ ప్లస్ సేవలను పొందొచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. 5జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకు 4జీ ప్లాన్లతోనే హైస్పీడ్ డేటా సేవలు పొందొచ్చని పేర్కొంది. అయితే, 5జీ ఫోన్లన్నీ ఎయిర్‌టెల్ 5జీకి సపోర్ట్ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్ తయారుదారులు ఓటీఏ అప్‌డేట్ ఇవ్వాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
Read Also: Annie Ernaux: ఫ్రాన్స్ రచయిత్రికి నోబెల్ సాహిత్య పురస్కారం
భారతదేశంలో తన 5G నెట్‌వర్క్ ను ప్రారంభించడాన్ని జియో అధికారికంగా ధ్రువీకరించినప్పటికీ ఈ సేవలు దీపావళి నుండి ఎంపిక చేసిన సీటీస్లో మాత్రమే ప్రారంభమవుతాయి. అయితే, కంపెనీ తన ‘ట్రూ-5G సేవల’ బీటా ట్రయల్‌ను దసరా సందర్భంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి సహా నాలుగు నగరాల్లో దసరా సందర్భంగా 5G సామర్థ్యాలను పరీక్షించనుంది.
ఇక.. రిలయన్స్ ఛైర్మన్ ప్రకారం, దేశంలో నెట్‌వర్క్ విస్తరించడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. జియోకు అతిపెద్ద ప్రత్యర్థిగా ఎయిర్‌టెల్ ఉండబోతోంది. దేశంలో 5G సేవలను ప్రారంభించిన మొదటి కంపెనీగా అవతరించింది. మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా అందుబాటులోకి వస్తాయని ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. కాబట్టి, ప్రస్తుతం ఎయిర్‌టెల్ రేసులో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, జియో దేశవ్యాప్త కవరేజీని మరింత వేగంగా అందించాలని ప్లాన్ చేస్తోంది.