వైద్య రంగంలో విశేష సేవలు అందించినందుకు సంతోషంగా ఉందని, పద్మవిభూషణ్ అవార్డు తనలో బాధ్యతని ఇంకా పెంచిందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డు తనకు రాలేదని.. వైద్య రంగానికి, తన ఇన్‌స్టిట్యూషన్‌కు వచ్చిందని భావిస్తానన్నారు. ఏఐని వినియోగించి.. తక్కువ ఖర్చులతో వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు వైద్య వృత్తిలో ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లేవారని, ఇపుడు ఇతర దేశాల నుంచి మన దగ్గరికి రీసెర్చ్ కోసం వస్తున్నారని నాగేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం 2025 వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.
తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని వైద్య విభాగంలో పద్మవిభూషణ్ వరించింది. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ‘వైద్య రంగంలో విశేష సేవలు అందించినందుకు సంతోషంగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డు నాలో బాధ్యతని ఇంకా పెంచింది. ఈ అవార్డు నాకు రాలేదు… వైద్య రంగానికి, నా ఇన్‌స్టిట్యూషన్‌కు వచ్చిందని భావిస్తాను. వైద్యంతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేశాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వస్తున్న జబ్బులు.. వాటి మధ్య వ్యత్యాసాలు గమనించేందుకు పరిశోధనలు చేసాము. ఏఐని వినియోగించి.. తక్కువ ఖర్చులతో వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పరిశోధనలు అంటే ప్రభుత్వం మాత్రమే చేసేది కాదు.. అందరూ చేయచ్చు. అనేక దేశాల అత్యున్నతమైన సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి కానీ.. నేను ఇక్కడే నా సేవలు అందించాలని, పరిశోధనలు చెయ్యాలని, అత్యధికంగా వైద్యులను తయారు చెయ్యాలని నిర్ణయించుకున్నా. ఒకప్పుడు వైద్య వృత్తిలో ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇపుడు ఇతర దేశాల నుంచి మన దగ్గరికి రీసెర్చ్ కోసం వస్తున్నారు. ఇప్పుడు మన దేశం హెల్త్ హబ్ గా మారుతోంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వైద్యులు హార్డ్ వర్క్ చెయ్యాలి’ అని అన్నారు.
Also Read: TSRTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు ఎండీకి సమ్మె నోటీసులు!
‘వైద్య రంగంలో ఐకాన్స్ లేరు, ఐకాన్స్ తయారు కావాలి. యువత వైద్యాన్ని కూడా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని పనిచేయాలి. వైద్యం గ్రామీణ ప్రాంతాలకు అందాలి. రిమోట్ ఏరియాలకు అందించడానికి ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందించే అవకాశం ఉంది. అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు కృషి చెయ్యాలి. క్షేత్ర స్థాయిలో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. వైద్యం అందరికీ సమానంగా అందాలి. వైద్యం, విద్యా అందరికీ సమానంగా అందించాలి. ప్రస్తుతం వైరస్లు ఏవైనా తట్టుకునే శక్తి ఇప్పుడు మనకు వచ్చేసింది. కరోనా వైరస్ మనకు అనేక పాఠాలు నేర్పింది. ప్రకృతితో ఎప్పుడూ మనం ఆడుకోవద్దు. హెల్తీ లైఫ్ స్టైల్ చాలా అవసరం. నా తండ్రిని ఆదర్శంగా తీసుకుని నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, నిజాయితీ, హార్డ్ వర్క్, హ్యూమిలిటీ చాలా అవసరం. డాక్టర్లు సమాజంలో భాగమే కాబట్టి అక్కడక్కడ అనైతికంగా ప్రాక్టీస్ జరుగుతోంది. దాన్ని కట్టడి చేసి సరైన దారిలో నడిపించగలగాలి. వైద్యుడికి పేషెంట్ ఆర్గాన్స్ అన్ని అప్పగిస్తారు కాబట్టి నైతికమైన వైద్యం అందించాలి. ప్రపంచంలో బాగా ఎదిగిన వారు డబ్బుతో కాకుండా వారి పని పట్ల నిబద్ధతతో పైకి వచ్చారు’ అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.