తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (జనవరి27) సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎండీని కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు.
ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్దమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను సైతం పరిష్కారం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Suryapet Crime News: సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమ వివాహం చేసుకుందని..!
కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఈవీ బస్సుల రాకతో ఉద్యోగులు బస్ డిపోలు ఖాళీ చేస్తున్నారు. అధికారులు ఆర్టీసీ కార్మికుల్ని ఇతర డిపోలకు మారుస్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని జేఏసీ సమ్మె బాట పట్టనుంది. నేడు ఆర్టీసీ ఎండీ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే.. మార్చి మొదటి వారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.