హై కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేయడంతో టెన్షన్ పెరిగింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఏమి చేయాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈడీ తదుపరి చర్య ఏంటి?
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-రేసు కేసును అటు ఏసీబీ, ఇటు ఈడీ విచారిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని ఈడీ మాజీ మంత్రికి తెలిపింది. జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించారు. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
ఏసీబీ ఏం చేయబోతోంది?
ఈ కేసులో విచారణకు సోమవారం ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. అక్కడ న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని నిలదీశారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి సోమవారం నోటీసులిచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయాలని.. అరెస్ట్‌పై స్టేను ఎత్తివేయాలని ఏసీబీ కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఏసీబీకి అనుకూలంగా తీర్పు రావడంతే తదుపరి నిర్ణయంపై భారీ ఉత్కంఠ నెలకొంది.