Afghanistan – India: భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ పరిశ్రమ & వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ సోమవారం కీలక ప్రకటన చేశారు. బంగారం తవ్వకంతో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అజీజీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు వాణిజ్య సమస్యలను సృష్టిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల కోసం యంత్రాలను దిగుమతి చేసుకునే భారతీయ కంపెనీలకు 1% సుంకం మాత్రమే వసూలు చేస్తామని ఆయన వెల్లడించారు.
పన్ను మినహాయింపులు..
ఆఫ్ఘన్ మంత్రి అజీజీ.. ” ఆఫ్ఘనిస్థాన్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అక్కడ మీకు ఎక్కువ మంది పోటీదారులు కనిపించరు” అని చెబుతూ పెట్టుబడులను ఆహ్వానించారు. పెట్టుబడి పెట్టే కంపెనీలకు టారిఫ్ మద్దతు, భూమిని ఇస్తామని ఆయన వెల్లడించారు. అదనంగా కొత్త రంగాలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. భారతీయ కంపెనీలు పెట్టుబడి కోసం యంత్రాలను దిగుమతి చేసుకుంటే, వాటికి 1 శాతం సుంకం మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. అలాగే బంగారం తవ్వకాలపై మాట్లాడుతూ.. “బంగారు తవ్వకాలకు కచ్చితంగా సాంకేతిక, వృత్తిపరమైన బృందాలు లేదా వృత్తిపరమైన కంపెనీలు అవసరం” అని ఆయన అన్నారు. అయితే ఉద్యోగాలను సృష్టించడానికి దేశంలోనే ప్రాసెసింగ్ జరగాలని ఆయన షరతు విధించారు.
వ్యాపారంలో సమస్యలు తొలగించాలి..
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి “చిన్న” అడ్డంకులను తొలగించాలని అజీజీ భారత ప్రభుత్వాన్ని కోరారు. “మేము భారతదేశం – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలను మెరుగుపరచాలనుకుంటున్నాము” అని ఆయన భారత ప్రభుత్వ అధికారుల సమక్షంలో అన్నారు. “వీసాలు, ఎయిర్ కారిడార్లు, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి కొన్ని చిన్న అడ్డంకులు ఈ మొత్తం ప్రక్రియను నిజంగా ప్రభావితం చేస్తాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మెరుగుపరచడానికి వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
READ ALSO: Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్..