Actress Sangeetha Said I Love To Act in Telugu Movies than Tamil: సంగీత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్‌గా కొనసాగారు. రవితేజ, శ్రీకాంత్, జగపతిబాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ సంగీత సినిమాలు చేశారు. వివాహం అనంతరం చిన్న చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమిళ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తమిళం కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టమని చెప్పారు. తమిళ ఇండస్ట్రీలో కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారన్నారు.
‘నాకు తమిళం కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఇష్టం. దానికి కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఈ విషయం విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసినా పెద్దగా పట్టించుకోను. నేను నిజం చెబుతున్నా. తమిళంలో నటిస్తున్నప్పుడు సరైన గౌరవం, మర్యాద ఉండదు. తమిళంలో తానెవరినీ అవకాశాలు అడిగింది లేదు. ఎందుకంటే తెలుగులో నాకు అవకాశాలు, ఆదరణతో పాటు మంచి పారితోషకం వస్తుంది’ అని సంగీత చెప్పారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్‌తో సెల్ఫీ తీసుకోవాలనే కోరిక తీరింది: మెల్‌బోర్న్ మేయర్
‘తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసి మర్యాద లేకుండా మాట్లాడతారు. వారే నాకు జీవితాన్ని ఇస్తున్నట్లు వ్యవహరిస్తారు. నేను ఇంటి కరెంట్ బిల్లు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు మాట్లాడుతారు. నా పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించి.. కేవలం నటించి వెళ్లండి అని అంటారు. వారికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ.. వాళ్లు నాకు ఇవ్వరు. అందుకే తమిళంలో పెద్దగా నటించను’ అని సంగీత చెప్పుకొచ్చారు. సంగీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంగీత గాయకుడు క్రిష్‌ను 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే.. యాంకర్‌గా, రియాల్టీ షో జడ్జిగా కూడా ఉన్నారు.