GN Saibaba: మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురి విడుదలపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తదితరులను విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అక్టోబర్ 14న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఈరోజు ప్రత్యేక విచారణలో సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును డిసెంబర్ 8న విచారణకు సుప్రీం కోర్టు లిస్ట్ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ వ్యాజ్యాన్ని విచారించింది. తన వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని గృహ నిర్బంధంలో ఉంచాలని జీఎన్ సాయిబాబా కోరగా.. ధర్మాసనం నిరాకరించింది.
మావోయిస్టులతో సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా సహా మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదైనా ఇతర కేసులో కస్టడీకి అవసరమైతే తప్ప, ఆయనను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర పిటిషన్‌పై 4 వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలంటూ సాయిబాబా, ఇతర నిందితులను సుప్రీం ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో వారి జీవిత ఖైదు శిక్ష కొనసాగనుంది.
Gulf oil Corporation: గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కి షాక్.. ఆ స్థలం ఉదాసీన్ మఠం స్వాధీనం
శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. మార్చి 2017లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. అందులో ఒక పాత్రికేయుడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి మావోయిస్టుల సంబంధాలు, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉపా చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ నిబంధనల ప్రకారం జీఎన్ సాయిబాబా, ఇతరులను కోర్టు దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.