Loksabha Elections 2024: పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు. భటిండా నుంచి గుర్మీత్ సింగ్ ఖుడియాన్, అమృత్సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లల్జిత్ సింగ్ భుల్లార్, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీత్ హయర్, పాటియాలా నుంచి డాక్టర్ బల్బీర్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు జలంధర్ నుంచి సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ పేరును ప్రకటించారు. ఫతేఘర్ సాహిబ్ నుంచి మాజీ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్‌కు టికెట్ ఇవ్వగా, ఫరీద్కోట్ నుంచి పోటీ చేసేందుకు కరమ్‌జీత్ అన్మోల్ పేరును ప్రకటించారు.
Read Also: Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి! మిస్టరీగా మారిన కేసు!
ఫిబ్రవరి 27న, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు, హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి తన అభ్యర్థులను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి కుల్దీప్ కుమార్‌ను నిలబెట్టింది, అయితే ఢిల్లీ మాజీ మంత్రి, సీనియర్ ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.పార్టీ దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సహిరామ్ పహల్వాన్‌ను పోటీకి దించగా, మహాబల్ మిశ్రా పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు. హర్యానాలో కురుక్షేత్ర నుంచి సుశీల్ గుప్తాను పోటీకి దించాలని ఆప్ నిర్ణయించింది.
పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. నాలుగు స్థానాలు షెడ్యూల్డ్ కులాల (SC) అభ్యర్థులకు రిజర్వు చేయబడ్డాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 8 స్థానాలను కైవసం చేసుకోగా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నాలుగు స్థానాలను కైవసం చేసుకోగలిగింది. రాష్ట్రంలో తొలిసారిగా పోటీ చేసిన ఆప్ ఒక్క సీటును గెలుచుకుంది. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తొలి పార్టీ ఆప్ కావడం గమనార్హం.