ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల జరీన్ అనే మహిళా టూరిస్ట్ బెంగళూరులోని ఓ హోటల్‌లో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జరీన్ అనే మహిళా పర్యాటకురాలు ఈనెల 5న బెంగళూరుకు వచ్చినట్లు డీఎస్పీ శేఖర్ తెలిపారు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు శేషాద్రిపురంలోని హోటల్‌లో రెండో అంతస్తులో ఉన్న జరీన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా రూమ్‌లో నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. దీంతో హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మాస్టర్ కీ ఉపయోగించి లోపలికి వెళ్లి చూడగా జరీన్ శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు.
హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ కుమార్ అనే వ్యక్తి జరీన్ కోసం ఈనెల 16 వరకు హోటల్ గదిని బుక్ చేసినట్లు తెలిపారు. పర్యాటకురాలి మృతిపై అనుమానాలున్నాయని.. హత్య చేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శేఖర్ పేర్కొన్నారు. హోటల్ గదిలో ఏదో ఘర్షణ జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్నారు.
జరీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు వచ్చాక.. మృతిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హోటల్ మేనేజర్ గౌరవ్ కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సిబ్బంది హోటల్ గదిని తనిఖీ చేశారు. ఆమెను కలిసేందుకు గదిలోకి ఇంకెవరైనా వచ్చారా? అన్న విషయంపై కూడా సీసీటీవీ ఫుటేజీ, గెస్ట్ రిజిస్టర్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.