Revanth Reddy Swearing Ceremony Time Changed: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 10.28 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించగా.. తాజాగా ఆ సమయంలో స్వల్ప మార్పు జరిగింది.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. మరోవైపు తన ప్రమాణస్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఢిల్లీ పెద్దలకు రేవంత్ ఆహ్వానం పలుకుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణికం ఠాకూర్‌లు రేవంత్ ప్రమాణ స్వీకారంకు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్.. నేటి మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.