Do Kaliyaan Movie: దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో ‘దో కలియా’ అదే తీరున సందడి చేసింది. ఈ చిత్రానికి మాతృక తమిళంలో తెరకెక్కి విజయం సాధించిన ‘కుళందైయుమ్ దైవముమ్’. 1965లో రూపొందిన ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966లో ఇదే కథతో తెలుగులో జమున కథానాయికగానే ‘లేతమనసులు’ రూపొంది, ఇక్కడా ఘనవిజయం సాధించింది. ఈ రెండు చిత్రాలలోనూ కుట్టి పద్మిని బాలనటిగా ద్విపాత్రాభినయం చేసి మురిపించారు. ఆ తరువాత 1968లో హిందీ చిత్రం ‘దో కలియా’ రూపొంది, అక్కడా జయకేతనం ఎగురవేసింది. మూడు భాషల్లోనూ ఏవీయమ్ సంస్థ ఈ కథను తెరకెక్కించింది. అసలు ఈ కథకు 1961లో తెరకెక్కిన అమెరికన్ మూవీ ‘ద పేరెంట్ ట్రాప్’ ఆధారం. ఆ కథకూ 1949 వెలుగు చూసిన జర్మనీ నవల ‘లిసా అండ్ లొట్టీ’ మూలం. ఇలా పాశ్చాత్య దేశాల్లో వెలుగు చూసిన ఈ కథ మన భారతదేశంలో ఉత్తర, దక్షిణ భేదం లేకుండా మురిపించడం విశేషం! ‘దో కలియా’ చిత్రం 1968 మార్చి 1న విడుదలయింది. ఇందులో జమున పాత్రను మాలా సిన్హా ధరించగా, హీరోగా బిశ్వజిత్ నటించారు. ఈ నాటి మేటి హీరో రణబీర్ కపూర్ తల్లి నీతూ సింగ్ ఈ చిత్రంలో బాలతారగా గంగ, జమున పాత్రల్లో భలేగా ఆకట్టుకున్నారు.
‘దో కలియా’ కథ విషయానికి వస్తే – ప్రేమించి పెళ్ళి చేసుకున్న శేఖర్, కిరణ్ తరువాత అంతస్థుల కారణంగా విడిపోతారు. వారికి గంగ, జమున కవల పిల్లలు. ఒకరు తల్లి దగ్గర, మరొకరు తండ్రి వద్ద పెరుగుతారు. విడిపోయిన శేఖర్ ను మేనక అనే డాన్స్ టీచర్ బుట్టలో వేసుకుంటుంది. దాంతో చిన్నారి గంగకు ఇంట్లో ఉండబుద్ధి కాదు. స్కూల్ లో అచ్చు తన పోలికలతోనే ఉన్న జమునను చూస్తుంది. ఇద్దరికీ అసలు విషయం తెలుస్తుంది. ఎలాగైనా కన్నవారిని కలపాలన్న ఉద్దేశంతో ఒకరి స్థానంలోకి ఒకరు వెళ్తారు. ఆపై శేఖర్ కు మేనక అసలు రూపం తెలియడం, అలాగే తాను తొందరపడి భర్తను వదలుకున్నానని కిరణ్ భావించడం జరుగుతుంది. ఈ లోగా తమ కన్నవారిని కలుపమని దేవుడిని వేడుకొని పుణ్యక్షేత్రం వెళతారు గంగ, జమున. అక్కడ కొన్ని పాట్లు పడతారు. పిల్లలను వెదుక్కుంటూ వచ్చిన శేఖర్, కిరణ్ కలుసుకుంటారు. చివరకు కన్నవారిని ఆ కవలపిల్లలు కలపడంతో కథ సుఖాంతమవుతుంది.
Read Also: Manchu Manoj: మోహన్ బాబు లేకుండానే మనోజ్ రెండో పెళ్లి..?
ఇందులో తెలుగు నటి గీతాంజలి డాన్స్ టీచర్ మేనకగా నటించారు. మెహమూద్, ఓం ప్రకాశ్, నిగర్ సుల్తానా, మనోరమ, హీరాలాల్ ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి రవి సంగీతం సమకూర్చగా, సాహిర్ లుదియాన్వీ పాటలు పలికించారు. ఇందులోని “తుమ్హారీ నజర్ క్యు కఫా హో గయీ…”, “ఏ షమా, ఏ రుత్, ఏ నజారే…”, “ముర్గా ముర్గీ ప్యార్ సే దేఖే…”, “చిత్ నందన్ ఆకే నాచూంగీ…”, “సజ్నా…ఓ సజ్నా…”, “బచ్చో మన్ కే సచ్ఛే…” అంటూ సాగే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ గళాల్లో జాలువారిన పాటలు సంగీతప్రియులను ఎంతగానో మురిపించాయి. మన్నాడే గానం చేసిన “ముస్లిమ్ కో తస్లీమ్ అర్జ్ హై… హిందూ కో పర్ నామ్…” పాట సైతం భలేగా ఆకట్టుకుంది. ఇందులోని “తుమ్హారీ నజర్ క్యు కఫా హో గయీ…” పాట బాణీల్లోనే తరువాతి రోజుల్లో ఏవీయమ్ సంస్థ ఏయన్నార్, జమున జంటగా తెరకెక్కించిన ‘మూగనోము’లో “ఈ వేళ నాలో…ఎందుకో ఆశలు…” అంటూ సాగే పాట రూపొందడం విశేషం!
తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకద్వయం ఆర్. కృష్ణన్, ఎస్. పంజు ‘దో కలియా’నూ రూపొందించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి, ఏవీయమ్ అధినేతలకు మంచి లాభాలు సంపాదించి పెట్టింది. తరువాతి రోజుల్లో ఇదే కథ పంథాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ‘కొడుకు దిద్దిన కాపురం’, కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘దేవుళ్ళు’ వంటి చిత్రాలు రూపొందాయి.