Visakhapatnam Central Jail: విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఓ గిరిజన ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది.. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు.. అసలు పోలీసులే కొట్టి చంపారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.. తమకు న్యాయం చేయాల్సిందేనంటూ కేజీహెచ్ లో ఆందోళనకు దిగారు.. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరిస్తు్న్నారు గిరిజనులు.
Read Also: Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఈ ఏడాది 5వ ఘటన..
అయితే, గత ఏడాది జులై 23వ తేదీన పెదబయలు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడా పోతన్న (45)ను అరెస్ట్ చేశారు పోలీసులు.. గంజాయి కేసులో అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు.. దాంతో.. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు.. కానీ, మరో మూడు రోజుల్లో బెయిల్‌పై విడుదల కావాల్సి ఉందని బంధువులు చెబుతున్నారు.. విశాఖ కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కోడా పోతన్నను జైలులోనే కొట్టి చంపారంటూ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందేఅంటూ ఆందోళనకు దిగారు. మూడు రోజుల్లో విడుదల కావాల్సిన వ్యక్తిని.. జైలులో ఎలా చనిపోయాడని నిలదీస్తున్నారు.. కేజీహెచ్ మార్చురీలో మృతదేహం ఉండగా.. అక్కడే ఆందోళన చేపట్టారు.