Male and Female Genitalia in One Man: మనషుల్లో కొందరు పలు రకాల అవయవాల లోపంతో లేదా ఎక్కువ అవయవాలతో పుడుతూ ఉంటారు. అయితే వాళ్లలో ఏర్పడే జననాంగాల ద్వారా స్త్రీ, పురుషులుగా గుర్తిస్తారు. అయితే తెలంగాణలో ఓ వ్యక్తి పురుష, స్త్రీ రెండు జననాంగాలతో జన్మించాడు. ఈ విషయం అతడికి పెళ్లయి, పిల్లలు పుట్టకపోవడంతో ఆలస్యంగా తెలిసింది. ఆ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందినట్టు గుర్తించిన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వాటిని విజయవంతంగా తొలగించారు. జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ సమస్య తలెత్తినట్టు వైద్యులు పేర్కొన్నారు.
మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై చాలా ఏళ్లు గడిచినా.. పిల్లలు పుట్టలేదు. తరచూ పొత్తి కడుపులో నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ యురాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వైఎం ప్రశాంత్ అతడిని చెక్ చేశారు. అతనికి అల్ట్రాసౌండ్ సహా పలు పరీక్షలు చేశారు. అతనిలో పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ.. వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉన్ననట్లు గుర్తించారు. అంతేకాదు స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్‌లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు.
ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో ఉదరభాగంలో ఉన్న వృషణాలు.. ఫాలోపియన్ ట్యూబులు, గర్భసంచి, స్త్రీ జననాంగంను కిమ్స్ ఆసుపత్రి యురాలజిస్టు ప్రశాంత్ తొలగించారు. రెండు రకాల జననాంగాలు ఉండటం వల్లే అతడికి ఇన్నాళ్లు సంతానం కలగలేదని వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, ప్రపంచ వ్యాప్తంగా 300 వరకు నమోదవగా మన దేశంలో కేవలం 20 మాత్రమే వెలుగుచూసినట్లు డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. హార్మోన్ల అసమత్యుల్య వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు మంగళవారం ఆయన తెలిపారు.
‘గర్భ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్, వృషణాలు ఉదర భాగంలోనే ఉన్న వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు లోపలే ఉండి వీర్య కణాలు ఉత్పత్తిగాక పిల్లలు పుట్టే అవకాశం ఉండదు’ అని వైద్యులు తెలిపారు ఇన్నేళ్లుగా ఆ వ్యక్తికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్ల వయసుకు ముందే ఈ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. వృషణాలను సాధారణ స్థితికి తెచ్చే అవకాశం ఉండేదని అన్నారు.