ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే చోదిమెళ్ల వద్ద సిమెంటు లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతి వేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం పూలే కమ్మగుడి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో సోమందేపల్లికి చెందిన మనోజ్ కుమార్ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.