Sabarmati Express: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాణాలతో బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో అనేక 20 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ ప్రాంతంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. యూపీలోని కాన్పూర్-భీమ్‌సేన్ స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్‌లో శనివారం తెల్లవారుజామున 19168 నంబరు గల సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. భీమ్‌సేన్ సమీపంలోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత, తెల్లవారుజామున 2.32గంటలకు రైలు పట్టాలు తప్పింది.
Read Also: Delhi: మెట్రో, ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
మరో వైపు కాన్పూర్‌కు ప్రయాణికులను తరలించేందుకు వీలుగా భారతీయ రైల్వే బస్సులను ఇప్పటికే ఘటనాస్థలానికి పంపించింది. బస్సుల ద్వారా సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను కాన్పూర్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా గమ్యస్థానానికి చేరుస్తామని అధికారులు తెలిపారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ యూపీలోని వారణాసి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వరకు సేవలను అందిస్తుంది. ఇదిలా ఉండగా.. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు సైతం ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు అవ్వలేదని నిర్ధారించారు.