Two Tigers: మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లో వేర్వేరు ప్రదేశాల్లో రెండు పులులు చనిపోయాయని అధికారులు ఇవాళ తెలిపారు. జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న తడోబా అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని మొహర్లీ పరిధిలోని కంపార్ట్‌మెంట్ 189లో గురువారం ఉదయం ఓ పులి చనిపోయిందని చీఫ్ అటవీ సంరక్షణాధికారి డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్కర్ తెలిపారు. పులిపై మరో పులి దాడి చేసినట్లు గుర్తులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దాదాపు 6 నుంచి 7 నెలల వయసు గల పులి పోరాటంలో చనిపోయి ఉండొచ్చన్నారు. పులి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించామన్నారు.
Elephant Attack: గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. ఆగ్రహంతో ఏం చేసిందంటే..?
అంతకుముందు బఫర్ జోన్‌లోని శివని రేంజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఓ పెద్దపులి మృతదేహం కుళ్ళిన స్థితిలో కనుగొనబడిందని ఆయన తెలిపారు.పెద్దపులి వయస్సు 14-15 సంవత్సరాల వరకు ఉంటుందని.. వృద్ధాప్యం కారణంగా మరణించి ఉండవచ్చన్నారు. అన్ని శరీర భాగాలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆ పెద్దపులిని దహనం చేసినట్లు తడోబా అంధారి టైగర్ రిజర్వ్ చీఫ్ అటవీ సంరక్షణాధికారి డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్కర్ అన్నారు.