నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీకి చెందిన టీఎస్ 05 జెడ్ 0249 నంబర్ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళుతోంది. గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ధాన్యం లోడుతో వెళుతున్న లారీని టీఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాద స్థలంలోనే డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. నెల్లూరుకు వెళ్తుండగా సీత అనే మహిళ మృతి చెందింది.
Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
గాయాలు అయిన కొందరిని కావలి ఏరియా ఆస్పత్రికి, ఇంకొందరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ వినోద్ నిద్రమత్తులో ఉండగా ఈ ఘటన జరిగిందని గుడ్లూరు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ వినోద్ మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.