Indonesia: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో హైస్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కారు, మూడు మోటార్‌సైకిళ్లను ఢీకొట్టడంతో 11 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు జావా ద్వీపంలోని పట్టణమైన డిపోక్ నుంచి ప్రముఖ పర్యాటక ప్రదేశమైన లెంబాంగ్‌కు వెళుతున్నారు. గ్రాడ్యుయేషన్ ట్రిప్‌కు హైస్కూల్ విద్యార్థులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం 6:48 గంటలకు ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
Read Also: Rajasthan: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మృతి
విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌ను జరుపుకుని.. పాఠశాలకు తిరిగి వస్తుండగా.. బస్సు అదుపు తప్పి కారు, మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు, మరో ద్విచక్రవాహనదారుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలు కాగా.. మరో 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి ముందు బస్సు బ్రేక్ సరిగా పని చేయలేదని తాను అనుమానిస్తున్నానని, అయితే ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని స్థానిక ట్రాఫిక్ పోలీసు చీఫ్ ఉండంగ్ సైరిఫ్ తెలిపారు.