ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు యోగి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నితీష్ కుమార్ వంటి మిత్రపక్ష నేతలూ అటెండయ్యారు. జనంతో కిటకిటలాడింది లక్నో అటల్ స్టేడియం. నయా భారత్ నయా యూపీతో నినాదాలతో మార్మోగింది.
Read Also: Congress: కాంగ్రెస్ ప్రక్షాళన.. ఇవాళే కీలక భేటీ..
ఇక, యోగి ఆదిత్యానాథ్ కాకుండా 52 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా యోగి జంబోకేబినెట్ కొలువుదీరినట్టు కనపడుతోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రి పీఠం నిలబెట్టుకున్నారు. అయితే, దినేష్ శర్మను మాత్రం, బ్రాహ్మణ లీడర్ బ్రజేష్ పాతక్ తో రీప్లేస్ చేసింది బీజేపీ అధినాయకత్వం. సురేష్ ఖన్నా, సూర్యప్రతాప్ సాహి, స్వతంద్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, మాజీ బ్యూరోక్రాట్ ఏకే శర్మ, కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు యోగి కేబినెట్ లో చోటు దక్కింది. డానిష్ ఆజాద్ అన్సారి మాత్రమే యోగి మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మినిస్టర్. అలాగే మాజీ పోలీస్ అధికారి అసీమ్ అరుణ్, దయా శంకర్ సింగ్, నితిన్ అగర్వాల్, కల్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్ లకు ఇండిపెండెంట్ చార్జ్ లతో మంత్రులుగా స్థానం దొరికింది.. మొత్తంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో ఒకే ఒక్క ముస్లిం నేతకు చోటు దక్కింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డానిష్ అజాద్ అన్సారి.. గత యోగి సర్కార్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మొహిసిన్ రజా స్థానంలో ఈసారి చోటు దక్కించుకున్నారు. సహాయ మంత్రిగా అన్సారీ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అత్యధికంగా 273 స్థానాలు గెలిచింది. ఇందులో ఒక్క బీజేపీకే 255 సీట్లు వచ్చాయి. 37 ఏళ్ల నుంచి యూపీకి రెండోసీఎం అయినవారు లేరు. ఈ రికార్డును బద్దలుకొట్టారు యోగి. కొత్త మంత్రివర్గంతో దాదాపు రెండు గంటల పాటు సమావేశం కూడా నిర్వహించారు సీఎం యోగి ఆదిత్యనాథ్.