Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.
గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం మరియు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని హెచ్చరించింది. బుధవారం ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్ 5 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరోవైపు మంగళవారం ఐటీ రాజధాని బెంగళూర్లో కూడా భారీ వర్షాలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు చేరింది. జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిస్తే పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, డ్రైనేజ్ సమస్యలు ఏర్పడే అవకాశ ఉందని వీటిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. గత వారం రోజులుగా రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణం 10 మందికి పైగా ప్రజలు మరణించారు. పవర్ గ్రిడ్స్ కు తీవ్ర నష్టం ఏర్పడింది.