Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఎన్నిలక యాత్ర కాదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించడం ఈ యాత్ర ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇది సైద్ధాంతిక యాత్ర అని.. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ‘భారత్ జోడో యాత్ర’ కసరత్తు చేస్తుందనే వాదనలను ఆయన శనివారం కొట్టిపారేశారు. కాగా, అంతకుముందు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: People’s Anti-Fascist Front: జైైషే మహ్మద్ అనుబంధ ఉగ్రసంస్థపై కేంద్రం నిషేధం..
ప్రస్తుతం హర్యానాలోని కర్నాల్ మీదుగా యాత్ర కొనసాగుతోంది. త్వరలోనే కాశ్మీర్ లోకి యాత్ర ప్రవేశించనుంది. భారతదేశాన్ని ఒకటిగా ఉంటాలనే ఉద్దేశంతోనే భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్లు కాంగ్రెస్ పలుమార్లు వెల్లడించింది. బీజేపీ హాయాంలో దేశంలో ద్వేషం, విభజన రాజకీయాలు ఎక్కువయ్యాయని.. వాటికి ఎదుర్కొనేందుకు దేశ ప్రజల ఐక్యత చాటేందుకు భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను తన యాత్రలో హైలెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ.
సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ‘భారత్ జోడో యాత్ర’ మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతూ.. ఈ నెలఖరులో కాశ్మీర్ లో ముగియనుంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో యాత్ర జరిగింది.