People’s Anti-Fascist Front Ban: పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర సంస్థకు ప్రాక్సీగా వ్యవహరిస్తున్న ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పీఏఎఫ్‌ఎఫ్)పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం(యూఏపీఏ)-1967 కింద ఈ నిషేధం విధించింది. లష్కరే తోయిబా సబ్యుడు అర్బాజ్ అహ్మద్ మీర్ ను వ్యక్తిగత ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్న భద్రతా బలగాలు, రాజకీయ నాయకులు, పౌరులను పీఏఎఫ్‌ఎఫ్ బెదిరిస్తోందని హోంశాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ తో పాటు భారతదేశంలో ప్రధాన నగరాల్లో హింసాత్మక ఉగ్రవాద చర్యలు చేపట్టినందుకు, ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతుందని హోంశాఖ పేర్కొంది. తుపాకులు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను నిర్వహించడం శిక్షణ ఇవ్వడం, యువతను ఆకట్టుకుని రిక్రూట్, శిక్షణ ఇవ్వడం వంటి వాటికి పీఏఎఫ్‌ఎఫ్ పాల్పడుతోందని..భారతదేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడింది మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Uttar Pradesh: యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. పిల్లాడిని ఈడ్చుకెళ్లిన కారు.
కేంద్ర హోంశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన అర్బాజ్ అహ్మద్ మీర్‌ను వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉండీ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు పనిచేస్తున్నట్లు తెలిపింది. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో మహిళా ఉపాధ్యాయురాలు రెయిన్ బాలా హత్యకు ప్రధాన కుట్రదారుగా తేల్చింది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని మీర్ హత్యలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. మీర్ కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని సమన్వయం చేయడంతో పాటు సరిహద్దులు దాటి ఆయుధాలను సరఫరా చేస్తూ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటికే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా వ్యవహరిస్తున్న ‘ ది రెసిస్టెంట్ ఫోర్స్’ను కేంద్రం నిషేధించింది. నేరుగా ఉగ్రవాద సంస్థల పేరుతో కాకుండా కాశ్మీర్ తిరుగుబాటు సంస్థలుగా చెలామణి అవుతున్న ‘ది రెసిస్టెంట్ ఫోర్స్’, ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ సంస్థలను నిషేధించింది.